
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 15 శర్మాస్ వలి మండల రిపోర్టరు యాడికి
ధాన్యం, మొక్కజొన్న, పత్తి, అరటి తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ సిపిఐ నాయకులు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ భూమిలేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలని .ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, గోనె సంచులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తేమ శాతం, రంగు మారిందన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు 75 కేజీల బస్తాను తక్కువ ధరకు అమ్మి భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉన్నా మార్కెట్లో రూ.1600 నుంచి 1700కే కొనుగోలు జరుగుతోందని, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. పత్తి రైతులు కూడా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టపోయారని, సీసీఐ కేంద్రాల్లో అనేక కొర్రీలు పెట్టి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించారు.రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కిలో అరటి ధర రూ.0.50 కూడా రావడం లేదని తెలిపారు. వ్యాపారస్తుల సిండికేట్ వల్ల రైతుల ఆదాయం దెబ్బతింటోందని పేర్కొన్నారు.మోంథా తుఫాను కారణంగా భారీ నష్టం జరిగినప్పటికీ రైతులకు ఇప్పటివరకు సరైన నష్టపరిహారం అందలేదని, పంటల భీమా పథకాలు కూడా రైతులకు ఉపయోగపడడం లేదని విమర్శించారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘాలు పలు డిమాండ్లను ప్రకటించాయి. మద్దతు ధరలతో పాటు బోనస్ చెల్లించి పంటలు కొనుగోలు చేయాలని, భూమిలేని కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని, పంటల భీమా ఉచితంగా అమలు చేయాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ ప్రతాపరెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు, చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ, సిపిఐ పట్టణ కార్యదర్శి కుల్లాయి రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు నబి రసూల్ గరిడీ శివన్న, సుబ్బారావు పాల్గొన్నారు
