పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 24. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ పకడ్బందీగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఇంటర్ పరీక్షలకు 72, పదవ తరగతి పరీక్షలకు 97 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ ఖమ్మం : రాబోయే ఇంటర్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 72, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 97 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 6వ తారీఖున ఒక సెట్,10వ తారీఖున రెండవ సెట్ ప్రశ్నా పత్రాలు జిల్లాకు వస్తాయని, వీటిని ట్రెజరీ రూమ్ లో భద్రపరిచి, జిల్లాలో 6 రూట్ లలో ప్రశ్నా పత్రాల తరలింపు ఉంటుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రశ్నా పత్రాల తరలింపు సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉండాలని అన్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 6 ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో సిట్టింగ్స్ స్క్వాడ్ ఉంటుందని, వీరందరికీ స్పష్టమైన ఆర్డర్స్ అందించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రశ్నా పత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను రవాణా శాఖ అధికారి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద స్థానిక సంస్థల ద్వారా పారిశుద్ద్య నిర్వహణ చేయాలని అన్నారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద చల్లని త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.పబ్లిక్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షలు ముగిసిన తర్వాత పోస్టల్ శాఖ ద్వారా జవాబు పత్రాలు సరిగ్గా పంపేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా క్లోస్డ్ కంటెయినర్ లలోనే జరగాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి త్రాగునీటి సరఫరా ఉండే విధంగా సంబంధిత మున్సిపల్ అధికారులు లేదా గ్రామీణ నీటి సరఫరా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, డి.పి.ఓ. ఆశాలత, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కళావతి బాయి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ఆర్టిసి, విద్యుత్, మునిసిపల్, పోస్టల్, ట్రెజరీ, పోలీస్, సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.