
పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే, ముఖ్యఅతిథిగా హాజరైన బిసి రాజారెడ్డి,కాలేజీ జీవితం ఎంతో విలువైనది. బిసి రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుందని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిసి రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలకు చేరుకున్న బిసి రాజారెడ్డికి ప్రిన్సిపల్ లలిత ఆధ్వర్యంలో అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బిసి రాజారెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బిసి రాజారెడ్డి మాట్లాడుతూ,కాలేజీ జీవితం ఎంతో విలువైనది అన్నారు. ఈ సమయంలో తప్పటడుగులు వేయకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. 10 నుంచి 25 ఏళ్ల వయస్సు లోపు మనం తీసుకునే సరైన నిర్ణయాలే మన వందేళ్ళ భవిష్యత్తుకు పునాది లాంటివన్నారు. ప్రతిఒక్కరికి స్నేహితుల అవసరమని అయితే చెడు స్నేహాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి పిల్లలను చదివిస్తుంటారని వారి ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని సూచించారు. చదువు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని, చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. కడప జిల్లా నందలూరు లో కనీసం వీధి దీపాలు, కరెంటు లేని సమయంలో లాంతరు వెలుగుల్లో చదువుకొని ఐదుగురు ఐఏఎస్ సాధించారన్నారు. అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రముఖ సైంటిస్ట్ గా దేశానికి ఎంతో విలువైన సేవలు అందించి రాష్ట్రపతిగా ఎదిగాడన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యసించాలని సూచించారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. దినపత్రికలు, పుస్తక పఠనం దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. జ్ఞానంతో పాటు లోకజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం లభిస్తే సమాజం ద్వారా లోకజ్ఞానం నేర్చుకోవాలన్నారు. బనగానపల్లె డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ లలిత ఆధ్వర్యంలో బిసి రాజారెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజిక, అధ్యాపక బృందం, భానుముక్కల సహకార సంఘం చైర్మన్ అబ్దుల్ కలాం పాల్గొన్నారు.

