పైనుంచి సూర్యుడు మార్చి 24 టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు
అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో ఉన్న జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ అన్ని గదులను కలెక్టర్ కలియ తిరిగారు. ఎలక్ట్రిసిటీ, తాగునీరు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పైన చీఫ్ సూపరింటెండెంట్ కి పలు సూచనలు అందించారు. వార్షిక పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు అనే వివరాలను, పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన రికార్డులను, ప్రశ్న పత్రాలు, పరీక్షల అనంతరం జవాబు పత్రాల తరలింపునకు సంబంధించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకుండా నిశితంగా పరిశీలించాలని అన్నారు.ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్‌కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.