
ప్రకృతిని కాపాడుతూ పండుగలు జరుపుకోవాలని విద్యార్థులకు పిలుపు
పయనించే సూర్యుడు న్యూస్: సెప్టెంబర్ 11 తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత వినాయకుల తయారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల పర్యావరణ పరిరక్షణ సంఘం, జీవశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు మట్టి, సహజసిద్ధమైన పదార్థాలతో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలను నిర్వహించాలనే సందేశాన్ని తమ సృజనాత్మకత ద్వారా సమాజానికి అందించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, అదే సమయంలో ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటిలో సులభంగా కలిసిపోయే మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా జల కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.ప్లాస్టర్తో తయారు చేసిన విగ్రహాలు, రసాయనిక రంగుల వల్ల నీటి వనరులతో పాటు జలచర జీవులకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల మట్టి మరియు సహజ పదార్థాలతో తయారు చేసిన పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.“పండుగను ఆనందంగా జరుపుకోవడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం. విద్యార్థులు స్వయంగా పర్యావరణహిత వినాయకులను తయారు చేయడం అభినందనీయం” అని ప్రిన్సిపాల్ అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణ, సహజ వనరుల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్లాస్టర్ వినియోగాన్ని, రసాయనిక రంగుల వాడకాన్ని తగ్గించి మట్టి వినాయకులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.కార్యక్రమంలో కళాశాల ఉప ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. కరుణాకర్, పర్యావరణ పరిరక్షణ సంఘం సమన్వయకర్త, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. టి. ఉత్తర ఫాల్గుణి, జంతుశాస్త్ర విభాగాధిపతి ఏ. గోపాల్, సౌజన్య, ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.విద్యార్థులు ఎంతో ఆసక్తి, సృజనాత్మకతతో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. పండుగల ఆనందంతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా మన బాధ్యతేనని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు, ప్రకృతికి అనుకూలమైన జీవన విధానంపై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు సూచించారు.