పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 12: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు: ప్రభుత్వం గుడుంబా నివారణ పై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రంగాల కళ్ళు కప్పి గిరిజన గ్రామాలలో యథేచ్చగా గుడుంబా సరఫరా చేస్తున్నారు. వీరి యొక్క ప్రధాన టార్గెట్ చిన్న చిన్న కూలీలుగా పనిచేసే వారే, వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొన్ని గ్రామాలలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈయొక్క గుడుంబా సేవించేవారు కూడా పార్ట్ టైం జాబుల మాదిరిగా ఉదయం ఐదు గంటలకి పనికి వెళ్లి 9 గంటల సమయానికి 150 రూపాయల కూలీతో ఇంటికి చేరుకొని వెంటనే గుడుంబా విక్రయించే స్థావరాలు దగ్గరికి వెళ్లి వచ్చిన కూలి మొత్తాన్ని అక్కడ తాగేస్తున్నారని వారి యొక్క భార్యలు వాపోతున్నారు. కుటుంబ పోషణకై కనీస కూర ఖర్చుల సైతం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇలాగే గుడుంబా అమ్మకాలు కొనసాగితే మా కుటుంబాలు వీధిన పడక తప్పదని అధికారులు జోక్యం చేసుకొని గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ఇక గుడుంబా అమ్మే వారి విషయానికి వస్తే వారిపై గతంలో కూడా అధికారులు కేసులు పెట్టారు గాని,వీరు తీరు మార్చుకోక మళ్లీ అదే పనిగా గుడుంబా అమ్మకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు గ్రామాలలో పటిష్టంగా నిఘా పెంచి గుడుంబా అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మండల ప్రజలు కోరుతున్నారు.