
పయనించే సూర్యుడు, ఆగస్ట్ 20, ముమ్మిడివరం ప్రతినిధి - గ్రంధి నానాజీ కాట్రేనికోన: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాట్రేనికోన మండలంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్లను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకస్మికంగా పరిశీలించారు.కాట్రేనికోన, వేట్లపాలెం జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను సందర్శించి, సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదుల్లో వెలుతురు, గాలి, ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసనా సామర్ధ్యాలను పరీక్షించారు. చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, వండుతున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, టీకాల రికార్డులను తనిఖీ చేశారు. చిన్నారులతో ముచ్చటించి వారికి చాక్లెట్లు అందించారు.కందికుప్ప, లక్ష్మివాడ గ్రామ పంచాయతీలలోని పోలింగ్ స్టేషన్లను కూడా పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ర్యాంప్, విద్యుత్, తాగునీరు, ఫ్యాన్లు వంటి కనీస వసతులు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓలు ఎన్ శంకర్ నారాయణ, ఎస్ సూర్య నారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శి జె వి సత్యన్నారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.