
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రికొత్తగూడెం :శుక్రవారం ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి 7 వరకు జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమానికి సంబంధించి, కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందం జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో, ముందస్తు ఏర్పాట్లను మరియు ఆరోగ్య కేంద్రాల స్థితిగతులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం పలు ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చాతకొండ పల్లె దవాఖాన మరియు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాలలో వైద్య సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత, శానిటేషన్, టీకా కార్యక్రమాల పురోగతి, గర్భిణీ స్త్రీలు మరియు శిశువులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసూతి గది, ఔషధ నిల్వ గది, ఔషధ నిల్వల పట్టిక, ల్యాబ్, అవుట్‌పేషెంట్ విభాగం, శానిటేషన్ విభాగం, పేషెంట్ వేటింగ్ హాల్స్ సవివరంగా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచి, రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆయుష్మాన్ కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందం పర్యటనకు ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి, అని సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఆరోగ్య కేంద్రం సమర్థవంతంగా పనిచేయాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రయోజనాలు పొందేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఆసుపత్రి ప్రాంగణాల్లో శుభ్రత, పచ్చదనం మరియు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బయో వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం జరగకూడదని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లాలో ఆరోగ్య సేవల నాణ్యతను పెంపొందించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి వైద్యుడు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, రోగులకు అవసరమైన సేవలు సమయానికి అందేలాచర్యలుకొనసాగించాలన్నారు.కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందం పర్యటన విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మరియు వైద్య సిబ్బంది ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.