యువ నాయకులు చిక్కం గోపాలకృష్ణ
పయనించే సూర్యుడు జనవరి 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్:- అశ్వారావు పేట పట్టణాన్ని మున్సిపాలిటీ గా ప్రకటించడం సంతోషమే అయినప్పటికీ కొన్ని ఇబ్బందుల దృష్ట్యా అధికారులు కొన్ని విషయాలను పరిగణన లోకి తీసుకోవాలని అశ్వారావు పేటకు చెందిన యువ నాయకులు చిక్కం గోపాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. అశ్వారావు పేట, పేరాయి గూడెం, గుర్రాలచెరువు గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మున్సిపాలిటీ వలన లాభపడుతున్నది ఎవరు? నష్టపోతున్నది ఎవరు? అనేది ప్రభుత్వం ఆలోచించి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని వారు కోరారు. అశ్వారావుపేట పట్టణంలో పేద, మధ్య తరగతి ప్రజానీకం ఎక్కువగా నివసిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు తమ సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి గ్రామకంఠం, అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి రేకుల షెడ్లు, చిన్న ఇళ్ళు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో పంచాయతీ రికార్డులలో తమ ఇళ్లను నమోదు చేసుకునేందుకు గ్రామ పంచాయితీ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఘటనలు మనం ఎన్నో చూశాం. ఎవరో చెప్పారని స్థానిక అధికారులు పేద ప్రజల ఇళ్లను రికార్డులకు ఎక్కించకుండా కాలయాపన చేశారని, ఇప్పుడు అకస్మాత్తుగా అశ్వారావుపేట ను మున్సిపాలిటీ చేసి సంబరాలు జరుకుంటుంటే పేద, మధ్య తరగతి ప్రజలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తమ ఇళ్ళు రికార్డులకు ఎక్కుతాయా? లేదా? ఒకవేళ రికార్డుల లోకి తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు భరించడం తమ వల్ల అవుతుందా? వంటి సవాలక్ష ప్రశ్నలు వారి మెదళ్లను తొలిచేస్తున్నాయన్నారు. అన్నీ ఉన్న ఆసాములు ఆనంద హేళలో తేలుతుంటే ఏమీలేని పేద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, కాబట్టి అశ్వారావుపేట పట్టణం పూర్తి స్థాయిలో మున్సిపాలిటీగా రూపాంతరం చెందకముందే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, ప్రతిపాదిత మున్సిపాలిటీ పరిధిలో దండోరా వేయించి, అతి త్వరలోనే సమస్యలను గుర్తించి తక్షణమే పేద ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజల్లో గూడు కట్టుకున్న అభద్రతా భావాన్ని తొలగించాలని వారు కోరారు.