
పయనించే సూర్యుడు జూన్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని చికెన్ షాపుల నుంచి ప్రతిరోజూ భారీ మొత్తంలో కోడి వ్యర్థాలను ప్రైవేట్ వ్యక్తులు సేకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక ఆటోలలో డ్రమ్ములు ఏర్పాటు చేసి చికెన్ షాపుల వద్ద నుంచి వ్యర్థాలను తీసుకెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యర్థాలను చేపలు, రొయ్యల చెరువుల్లో మేతగా వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా మాత్రమే వ్యర్థాల సేకరణ జరగాల్సి ఉండగా ప్రైవేట్ వాహనాలు ఈ పని చేయడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చికెన్ వ్యర్థాల సేకరణ, రవాణా, వినియోగంపై సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చికెన్ విక్రయాల్లో తూకం, నాణ్యత ప్రమాణాలపై కూడా అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.