పయనించే సూర్యుడు. జులై 11. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్
భావుసింగ్ నాయక్
జూలై 15 నాటికి ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసి నివేదిక అందించాలి
100 శాతం విద్యార్థులకు ఆధార్ నెంబర్ జనరేట్ అయ్యేలా చూడాలి
95 శాతం పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్. ద్వారా విద్యార్థుల హాజరు లక్ష్యంగా కృషి
విద్యాశాఖపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు.విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, ఎఫ్.ఆర్.ఎస్. అమలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులు, ఎఫ్.ఎల్.ఎన్. పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యాశాఖపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని, మౌళిక సదుపాయాల కల్పన, హెచ్ఆర్ పై పెట్టే ఖర్చుకు తగిన ఫలితం సాధించేలా పని చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలకు మంచి విద్యా ప్రమాణాలు అందాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పంపిణీ చేసిన ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల వివరాలను ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూలై 15 నాటికి ప్రతి విద్యార్థికి రెండవ జత దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసి వివరాలు అప్ డేట్ చేయాలని అన్నారు. పాఠశాలల తనిఖీ సమయంలో విద్యార్థులు యూనిఫామ్ వేసుకోని పక్షంలో చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకు అవసరమైన వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల ఇండెంట్, ఇప్పటి వరకు మనం చేసిన పంపిణీ వివరాలు స్పష్టంగా నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో చేపట్టిన ఎన్రోల్ మెంట్, మౌళిక వసతుల కల్పన వివరాలు యూ.డి.ఐ.ఎస్.ఈ. లో మండల విద్యా శాఖ అధికారులు అప్ డేట్ చేయాలని అన్నారు. మండలాల వారీగా విద్యార్థులకు అవసరమైన బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అప్ డేట్ యుద్ధ ప్రాతిపదికన చేసేందుకు సి.ఎస్.సి. ద్వారా క్యాంపు పెట్టాలని అన్నారు. జూలై 18 నుంచి మండల స్థాయిలో ఆధార్ అప్ డేట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని, ముందుగానే ఈ క్యాంపుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్ డేట్ అయ్యేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు ఆధార్ అప్ డేట్ చేసిన తర్వాత 100 శాతం అపార్ జనరేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 71 శాతం ఎఫ్.ఆర్.ఎస్. (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) ద్వారా ఉపాధ్యాయుల, విద్యార్దుల నమోదు జరుగుతుందని అన్నారు. జీరో ఎఫ్ఆర్ఎస్, లో అటెండెన్స్ ఉన్న పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జిల్లా వ్యాప్తంగా కనీసం 95 శాతం ఎఫ్.ఆర్.ఎస్. విద్యార్థుల హాజరు శాతం ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.విద్యార్థులు పాఠశాలలకు 3 రోజులు రాని పక్షంలో పాఠశాల నుంచి ఫాలో అప్ చేయాలని అన్నారు. హెడ్ మాస్టర్ ప్రత్యేక చొరవ కారణంగా రాబోయే 7 రోజులలో ఎఫ్.ఆర్.ఎస్. గణనీయంగా పెరగాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మౌళిక వసతుల కల్పన పెండింగ్ పనులపై రిపోర్ట్ అందించాలని అన్నారు. పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి పనులు పూర్తయినట్లు హెడ్ మాస్టర్, ఎస్.ఎం.సి. చైర్మన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సంతకాలు పెడితేనే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు. పాఠశాలలో పెండింగ్ ఉన్న మైనర్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మనం పెట్టే డబ్బులు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా హెడ్ మాస్టర్ పకడ్బందిగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. మన ఊరు మన బడి లో పెండింగ్ ఉన్న పెద్ద పనులు వివరాలతో రిపోర్ట్ అందించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా పని చేయాలని అన్నారు. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ అవసరమైన ఫీడ్ బ్యాక్ అందించాలని అన్నారు. ప్రతి నెల కాంప్లెక్స్ పరిధిలో విద్యా ప్రమాణాలు మెరుగుదలపై సమీక్షలు జరగాలని, దీనికి ప్రత్యేకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు. పిల్లలు వర్క్ బుక్ ఉపయో గిస్తున్నారా లేదు చూడాలని అన్నారు. పిల్లలకు తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం రావాలని, అదే విధంగా బేసిక్ మ్యాథ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే మూడు నెలల పాటు యుద్ద ప్రాతిపదికన 3వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పదాలు చదవడం స్కిల్ పెంచడంపై శ్రద్ద పెట్టాలని అన్నారు.ఎఫ్.ఎల్.ఎన్. క్రింద ఖమ్మం జిల్లాలో పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ డాక్యుమెంట్ చేస్తూ డిసెంబర్ నాటికి బుక్ తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి భవిత సెంటర్ లో అవసరమైన కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ , సీఎంఓ రాజశేఖర్, ఈఈ ఆర్ అండ్ బీ ఎం. పవార్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.