పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా, రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో మంత్రులు, న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు సంయుక్తంగా మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి పెద్దపీట వేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రాంతానికి రావడం అత్యంత సంతోషదాయకమని,ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 'డబుల్ ఇంజన్ సర్కార్' వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది" అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు, అభిమానులు, మరియు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు . పోలీసు, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు . ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి, సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి నూతన పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాయలసీమ ప్రజల తరఫున అపూర్వమైన, చారిత్రాత్మక స్వాగతం పలకడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు , ఏవీఆర్ ప్రసాద్ , కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్ , శ్రీదేవి , జైనాబి , గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్ , కొండారెడ్డి , కృపాకర్ , 14వ వార్డు ఖలీల్ , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి , ఉప్పరి సురేష్ కుమార్ , గాలి చంద్రశేఖర్ , కామిని మల్లికార్జున , చిన్నంశెట్టి శ్రీనివాసులు , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న , నంద్యాల మండలం ,గోస్పాడు మండలం ఎంపీడీవోలు మరియు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.