
పయనించే సూర్యుడు న్యూస్ :చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఫ్లైట్‌ను తాజాగా ప్రారంభించింది. ఇది విమానయాన చరిత్రలో మరో మైలురాయి. షాంఘై నుంచి బ్యూనస్ ఏరీస్ వరకు నడిచే ఈ కొత్త మార్గం మొత్తం 19,631 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. ఈ సేవలలో ప్రయాణ సమయం 25 గంటలు 30 నిమిషాలు. మధ్యలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఇంధనం నింపడం, సిబ్బంది మార్పు కోసం చిన్న స్టాప్ మాత్రమే ఉంటుంది. అయితే విమానం మార్చాల్సిన అవసరం లేదు. తిరుగు ప్రయాణం సుమారు నాలుగు గంటలు ఎక్కువ సమయం తీసుకుంటుందని ఎయిర్‌లైన్ ప్రకటించింది. ఈ కొత్త ఎయిర్రూట్ ద్వారా, ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే సింగపూర్ ఎయిర్‌లైన్స్ న్యూయార్క్-సింగపూర్ ఫ్లైట్ 19 గంటలను చైనా ఈస్టర్న్ అధిగమించింది. అదే విధంగా 2027లో సిడ్నీ-లండన్ ఫ్లైట్ 22 గంటల సేవను ప్రారంభించనున్నట్లు క్వాంటాస్ వెల్లడించడంతో, ప్రపంచవ్యాప్తంగా ‘లాంగెస్ట్ ఫ్లైట్’ పోటీ పెరుగుతోంది. ఈ కొత్త లాంగెస్ట్ ఫ్లైట్ డబుల్-డెక్కర్ కాదు కానీ దీర్ఘ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందిన 316 సీట్ల బోయింగ్ 777-300 ER ద్వారా నడుస్తోంది. సంవత్సరం పొడవునా వారానికి రెండుసార్లు సేవ అందించనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. మొదటి విమానయానం షాంఘై పుదాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 2 గంటలకు బయలుదేరి, బ్యూనస్ ఐరీస్‌లోని ఎజైజా అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 4.45కి షెడ్యూల్ కంటే పది నిమిషాల ముందుగా చేరింది.