పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 21 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు.. పోలీస్. ప్రపంచమంతా నిద్రలో ఉంటే వీరు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించిన పోలీసు అమరవీరులు ఎందరో… ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపిం చడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల దినం. గతంలో ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసిన కరోనా గత్తర కాలంలో పోలీసుల సేవలు మరువలేం. మన కాళ్లు బయటకు రాకుండా.. నిత్యం శ్రమిస్తూ అనేక మంది ఆ మహమ్మారి కరోనా కాటుకు బలైనారు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం.అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుం టారు. ప్రతి ఒక్కరూ ప్రతీ అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులంటే అటు అధికారులకు, ఇటు సమాజానికి చిన్నచూపే సమయపాలన లేని విధులు, పై అధికారులతో తిట్లు, జనంతో ఛీత్కారాలు.. ఇలా ఎన్నోసమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలు, ఒత్తిడులు ఎన్ని ఎదురైనా సమాజమనే కుటుంబాన్ని రక్షించడానికి నిరంతరం సూర్యునిలా కృషి చేస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు. వారిని గౌరవించడం మనందరి బాధ్యత