రుద్రూర్, మే 10 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న పాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిఘా కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అనుభవం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసు కుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫాస్ట్ ఫడ్ సెంటర్ల పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.