
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి30}
ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సి ఆర్ గోవింద్ రాజ్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజు మక్తల్ మండల లోని కర్ని పి హెచ్ సి మెడికల్ అధికారి డాక్టర్ తిరుపతి కి సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు 2026 ఫిబ్రవరి 12 న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్మిక వర్గ హక్కులపై నిరంతర దాడి కొనసాగించేందుకు తీసుకొస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.కేంద్ర బిజెపి తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా,కనీస వేతనాలు అమలు చేయాలని, అంగన్వాడి, ఆశ, మున్సిపల్, వివో ఏ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని జరగబోయే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.పార్లమెంటులో మంద బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అధికార యంత్రాంగం, యాజమాన్యాలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ సి అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి అమీనా బేగం, ఉపాధ్యక్షులు యశోద, ఆశమ్మ, సావిత్రమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
