
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్టు సమాచారం.స్థానిక సంస్థల్లో బి సి లకు రిజర్వేషన్ ను ప్రస్తుతం ఉన్న 29% నుండి 42%కి పెంచే లక్ష్యంతో బిసి రిజర్వేషన్ బిల్లును రూపొందించగా.. మార్చి 17న అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లును చట్టం చేసేందుకు పార్లమెంటుకు పంపగా అక్కడ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధం అయింది. బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే గవర్నర్ కు పంపినప్పటికీ, ఆయన ఇంకా ఆమోదం తెలపలేదు. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరారు. ఈ క్రమంలో ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ బిల్లు రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్‌ను సుప్రీం కోర్టు నిర్దేశించిన 50% పరిమితిని దాటి 67%కి తీసుకెళ్తుంది. దీనిలో బి సి లకు 42%, యస్ సి లకు 18%, యస్ టి లకు 10% రిజర్వేషన్‌లు ఉన్నాయి. 50% రిజర్వేషన్ పరిమితిని దాటడం వల్ల కలిగే న్యాయ సమస్యలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్లు బిల్లులను ఒక నెలలోపు ఆమోదించాలి లేదా తిరిగి శాసనసభకు పంపాలని ఆదేశించిన నేపథ్యంలో, గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లును రాష్ట్రపతికి పంపితే, తెలంగాణ నుండి రాష్ట్రపతి భవన్‌లో పెండింగ్‌లో ఉన్న మూడవ బిల్లుగా ఇది మారుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, స్థానిక సంస్థల ఎన్నికలలో బి సి లకు 42% రిజర్వేషన్ అమలవుతుంది.