
పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలు ఈసారి వింత రికార్డును సృష్టించాయి. కోట్లకు కోట్లు ఆస్తులున్న కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ (ముంగేర్ స్థానం) పేరు వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 170 కోట్లు. కానీ అసలు ఆశ్చర్యం ఆయన సతీమణి ఆస్తుల లెక్క తెలిస్తేనే మొదలవుతుంది. ముఖ్యంగా ఆయన భార్య పేరిట ఉన్న చరాస్తుల విలువ కేవలం రూ. 132 మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టం అవుతోంది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న జరగనున్న నేపథ్యంలో.. అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల వివరాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత సంపన్న వ్యక్తి ఆస్తులు అక్షరాలా రూ. 170 కోట్లు. అంతకుమించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కుబేరుడి సతీమణి ఆస్తి విలువ కేవలం రూ. 132 మాత్రమేనని ఆయన అఫిడవిట్లో పేర్కొనడం.
బీహార్ అత్యంత ధనిక అభ్యర్థిగా కుమార్ ప్రణయ్ బీజేపీ తరఫున ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కుమార్ ప్రణయ్ రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 170 కోట్లు. ఇందులో స్థిర, చరాస్తుల వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నగదు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, ఇతర పెట్టుబడులతో చరాస్తుల విలువ రూ. 83.35 కోట్లు కాగా.. వ్యవసాయ భూములు, భవనాలు, వ్యవసాయేతర భూములు విలువ రూ. 86.65 కోట్లు. అయితే కుమార్ ప్రణయ్ ఆదాయం గత ఐదేళ్లలోనే గణనీయంగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.36 లక్షలుగా ఉన్న ఆయన వార్షిక ఆదాయం.. 2024-25 నాటికి ఏకంగా 146 శాతానికి పైగా పెరిగి రూ. 10.75 లక్షలకు చేరింది. అయితే ఇంతటి సంపద ఉన్న కుమార్ ప్రణయ్ సతీమణికి ఆస్తిపాస్తుల విషయంలో ఎలాంటి వాటా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె పేరిట కేవలం రూ. 132 విలువైన చరాస్తులు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో ప్రస్తావించారు. ADR నివేదిక ప్రకారం.. తొలి విడత పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో పోటీ చేస్తున్న 1,303 మంది అభ్యర్థుల్లో 519 మంది (40 శాతం మంది) మిలియనీర్లే. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తుల విలువ రూ. 3.26 కోట్లుగా ఉంది. అయితే 2020లో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచిన అనంతర్ సింగ్ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.70 కోట్లకు చేరుకుంది. జేడీయూ తరఫు నుంచి పోటీ చేస్తున్న ఈయన ప్రస్తుతం రెండో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. జేడీయూకు చెందిన మనోరమా దేవి రూ. 69 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు అత్యంత పేద అభ్యర్థులుగా ఎస్‌యూసీఐ పార్టీకి చెందిన మహ్మద్ ముజాహిద్ ఆలం, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన శత్రుఘ్న వర్మ నిలిచారు. వీరిద్దరి ఆస్తుల విలువ కేవలం రూ. 1000 మాత్రమే.
కుమార్ ప్రణయ్‌కు 'క్లీన్' రికార్డు కొండంత సంపద ఉన్నప్పటికీ.. కుమార్ ప్రణయ్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేకపోవడం మరో విశేషం. తొలి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ.. ప్రణయ్‌పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇది ఆయన రాజకీయాల్లోనూ, ఆర్థికంగానూ తిరుగులేని స్థితిలో ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.