పయనించే సూర్యుడు అక్టోబర్ 14,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
బేడ బుడగ జంగం కమ్యూనిటీకి మళ్లీ (SC) హోదా కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దృష్టికీ రెండు సార్లు తీసుకెళ్ళానని, మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దృష్టికి కూడా బేడ బుడగ జంగం ఎస్ సి రిజర్వేషన్ సమస్య తీసుకెళ్లుతానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం శ్రీనివాసనగర్ లోని బుడగ జంగం కాలనిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించి ప్రధాన మంత్రి సభకు తరలిరావాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంచార జాతిగా, బిక్షాటనచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, ఎంతో మంది ఉన్నత చదువులు కూడా చదివారనీ, ఎస్ సి రిజర్వేషన్ ఉండి ఉంటే ప్రభుత్వం ఉద్యోగం సాధించేవారని, చదువుల్లో 98 శాతం మార్కులు వచ్చిన బేడబుడగ జంగం విద్యార్థులు రిజర్వేషన్ లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎస్ సి రిజర్వేషన్ కల్పించి న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకు ఉందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక పురోగతిశీలమైన చర్యగా జె.సి. శర్మ (ఐ.ఏ.ఎస్ రిటైర్డ్) నేతృత్వంలో ఒక ఏకగుణ కమిషన్ను ఏర్పాటు చేసిందనీ, కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి బేడా బుడగ జంగం సామాజిక, ఆర్థిక, విద్యా నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుని, ఈ సామాజిక వర్గాన్ని తిరిగి చేర్చాలని సిఫార్సు చేసిందనీ ఆమె అన్నారు.ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, బేడా బుడగ జంగం కులాన్ని SC జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేసిందని, ఈ ఫైల్ *రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI), న్యూ ఢిల్లీ కార్యాలయంలో పెండింగ్లో ఉందని,RGI కార్యాలయంతో దౌత్యంగా చర్చించి, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఎలాంటి అనవసర ఆలస్యం లేకుండా, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లయితే, బెద బుడగ జంగం సామాజిక వర్గానికి నిజమైన న్యాయం జరుగుతుందనీ, ఇతర జాతులకు లభిస్తున్న రక్షణలు, హక్కులు, ప్రయోజనాలు బేడ బుడగ జంగం కులానికి కూడా అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.