
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు హిందీ విభాగాధిపతి డా. పవన్ కుమార్ పాండే మాట్లాడుతూ హిందీ భాష దేశ ప్రజలను కలిపే భాషగా, జాతీయ సమైక్యతను పెంపొందించే భాషగా, స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన భాషగా, దేశ సమగ్రతను కాపాడటంలో, భారతీయ సంస్కృతి–సంప్రదాయాలను పరిరక్షించడంలో విశేష పాత్ర పోషిస్తోందని వివరించారు. వివిధ మాతృభాషలు మాట్లాడే ప్రజల మధ్య అనుసంధాన భాషగా హిందీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.ప్రస్తుత కాలంలో హిందీ ద్వారా వివిధ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా విద్యా రంగంలో హిందీని మరింత విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని డా. పవన్ కుమార్ పేర్కొన్నారు.కార్యక్రమం డా. జె. ఓంప్రకాష్ పటేల్ సూత్ర సంచలనంలో వందేమాతరం గీతంతో ప్రారంభమైంది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు కబీర్, తులసీదాస్, రహీం తదితర కవుల దోహాలను ఆలపిస్తూ వాటి భావాలను వివరించారు.ఈ సందర్భంగా డా. భీమ్రావు “కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో హిందీ”, ఇర్ఫాన్ “హిందీ భాషలోని మాధుర్యం”, తెలుగు సహాయ ఆచార్యులు ఆరే రాజు “తెలుగు–హిందీ భాషల మధ్య ఉన్న అంతర సంబంధం”, డా. యు. రవి కుమార్ “హిందీ భాష ద్వారా కలిగే ఆనందం”,డా. కె. రఘునాథ్ “ప్రపంచ స్థాయిలో హిందీ భాష స్థితి” తదితర అంశాలపై ప్రసంగించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ కరొల్ల బుచ్చయ్య మాట్లాడుతూ హిందీ భాష ద్వారా లభించే వివిధ ఉపాధి అవకాశాలను వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.కార్యక్రమ ముగింపులో డా. శంకర్ హిందీ భాషలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.