మంత్రులు పొంగులేటి, తుమ్మల
సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష
పయనించే సూర్యుడు జూలై 14 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్ లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చించాలని, ఇంకనూ అవసరమైతే నిధులు కేటాయిస్తామని, నిధుల సమస్య ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. గడచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్చలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు.సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా లోలెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.చిన్న చిన్న వర్షాలు 200 మిల్లీమీటర్లకే బ్యాక్ వాటర్ వల్ల అక్కడున్న ప్రజలను తరలించవలసి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కోసం అక్కడున్నవారిని తరలించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపోయినట్లైతే, తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, రోడ్లు తెగిపోయిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సాధారణ జన జీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ భారీ వర్ష పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామం లో గరిష్టంగా 125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనదని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి పంట నష్టం, ఆస్తి నష్టం లేదా వరద ప్రభావం ఇప్పటివరకు సంభవించలేదని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారని తెలిపారు, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణ స్పందన కోసం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశామని వివరించారు.జిల్లాలో భద్రాచలంలో ఎన్డిఆర్ఎఫ్ బృందం, పాల్వంచలో ఎస్టిఆర్ఎఫ్ బృందం, అలాగే కొత్తగూడెం డివిజన్ పరిధిలోని చాతకొండ పోలీస్ బెటాలియంలో 100 మంది శిక్షణ పొందిన సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వరంగల్ లో వచ్చిన వరదలకు ప్రజలకు సహాయం అందించేందుకుగాను పాల్వంచ ఎస్డిఆర్ఎఫ్ బృందం పంపించామని తెలిపారు. అదేవిధంగా రోపులు, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, హ్యాండ్ మైకులు వంటి అత్యవసర పరికరాలు జిల్లా మరియు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.ఫైర్ శాఖ వద్ద 2 బోట్లు, పోలీస్ శాఖ వద్ద 5 బోట్లు – మొత్తం 7 బోట్లు జిల్లాలో మోహరించబడి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి విపత్తు పరిస్థితులు తలెత్తినా జిల్లా పరిపాలనా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఓ ఎస్ డి వెంకటరమణ మరియు ఏవో అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.