
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికె గంగాధర్
బాల్కొండ నియావర్గం లో భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తాం గత మా ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో భీమ్గల్ పట్టణాభివృద్ధి పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి, మార్కెట్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి,మూతపడిన భీమ్గల్ బస్ డిపోను తిరిగి ప్రారంభించాలి
విజయం వచ్చినా, అపజయం వచ్చినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి పోరాడుతుంది
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి 4 వార్డుల్లో గెలిపించిన ఓటర్లకు, అలాగే మిగతా 8 వార్డుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రజలందరికీ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జె ఫంక్షన్ హాల్ లో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ…గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భీమ్ గల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపాలిటీలో తమను గెలిపిస్తారని ఆశించామని ఎమ్మెల్యే తెలిపారు. కానీ ప్రజలు ఆశించిన స్థాయిలో తమపై దయ చూపలేదన్నారు. అయినప్పటికీ ప్రజల తీర్పును తాము శిరసావహిస్తున్నామని, విజయం వచ్చినా, అపజయం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను, గెలిచిన మరియు ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులం అందరం కలిసి భీమ్ గల్ అభివృద్ధి కోసం ఇకముందు కూడా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే భీమ్ గల్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి గత ప్రభుత్వంలో తమ శక్తి మేర భీమ్ గల్ కు నిధులు తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అన్నారు.
పట్టణంలోని 80 శాతం గల్లీలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం.రెండున్నర కిలోమీటర్ల మేర మెయిన్ రోడ్లకు సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం, బ్రహ్మాండమైన పార్కుల నిర్మాణం, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు.రూ. 40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి మంజూరు.రూ. 6 కోట్లతో నూతన మార్కెట్ నిర్మాణం.మూతపడిన భీమ్ గల్ బస్ డిపోను తిరిగి తెరిపించడం.హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికల అభివృద్ధి.72 లక్షలతో మైనారిటీల కోసం (ఈద్గా, మదరసా, షాదీఖానా) క్రిస్టియన్ చర్చిల కోసం రూ. 60 లక్షలు, గుడుల కోసం రూ. 60 లక్షల తో లింబాద్రి గుట్ట కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు.
తాము మంజూరు చేసి ప్రారంభించిన పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.ఇప్పటికే 80 శాతం పూర్తయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.70 శాతం పూర్తయిన మార్కెట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.ఇటీవల మళ్ళీ మూతపడిన భీమ్ గల్ బస్ డిపోను వెంటనే తెరిపించి, బస్సులను పునరుద్ధరించాలి.సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల కోసం గతంలోనే రూ. 11.5 కోట్లు మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ వల్ల ఆగిన ఆ పనులను గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బాధ్యత తీసుకొని వెంటనే పూర్తి చేయించాలి అని ఎమ్మెల్యే అన్నారు.ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం ఆగదు..ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పోరాటం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భీమ్ గల్ ప్రజల కోసం పని చేయాలన్నదే తమ తపన అని, తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే వేముల పేర్కొన్నారు