
పయనించే సూర్యుడు జూన్ 14 (సూళ్లూరుపేట నియోజక వర్గం దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్లో కొనసాగుతున్న భూ వివాదం వెనుక అసలు కారణం అధికారుల నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈ స్థలం ప్రభుత్వ భూమి అని అధికారులు స్థానికులకు తెలియజేయగా, మరోవైపు అదే స్థలంపై భిన్నమైన సమాచారం వెలువడు తుండటంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. భూమి ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేకపోవడం వివాదాన్ని మరింత జఠిలం చేసిందిఎంఆర్వో కార్యాలయం, రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ అధికారులు ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే చిన్న సమస్య పెద్ద వివాదంగా మారిందని ప్రజలు మండి పడుతున్నారు. భూమికి సంబంధించిన పూర్తి రికార్డులు అధికారుల వద్ద ఉన్నప్పటికీ ఇప్పటికీ యాజమాన్యంపై స్పష్టత ఇవ్వలేక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఇచ్చే పరస్పర విరుద్ధమైన సమాచారం ప్రజలను అయోమయం లోకి నెట్టడమే కాకుండా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి వివాదాస్పద స్థలంలో జరుగుతున్న పరిణామాలపై రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలు పరస్పరం బాధ్యతలు తప్పించుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యను ప్రారంభ దశలోనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పరిస్థితి ఘర్షణలకు దారితీసే స్థాయికి చేరుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భూమి యాజమాన్యంపై అధికారికంగా స్పష్టత ఇవ్వడంతో పాటు సంబంధిత శాఖల బాధ్యతను నిర్ధారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అధికారుల నిర్లక్ష్యమే భవిష్యత్తు లో మరిన్ని వివాదాలకు, శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు