
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లో తెలుగు శాఖ ఆధ్వర్యంలో, (ఎన్ఎస్ఎస్) సహకారంతో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనం, తెలుగు సాహిత్య వైభవం, భాష పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్. జే భీమారావు మాట్లాడుతూ.. “మాతృభాష మన సంస్కృతికి మూలం.. మన భావాలకు వారధి.. మన అస్తిత్వానికి ప్రతీక” అని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా, తెలుగు మాట్లాడటంలో ప్రతి ఒక్కరూ గర్వపడాలని సూచించారు. "వ్యవహారిక భాష పై నల్లని మేఘాలు కుమ్ముకున్నప్పుడు పిడుగుగా వచ్చాడు గిడుగు" అని వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి సేవలను స్మరించుకుంటూ, తెలుగు భాషను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రాంథిక భాషతో పాటు ప్రజల నిత్యజీవితంలో ఉపయోగించే వ్యవహారిక భాషకు ప్రాధాన్యత కల్పించిన గిడుగు గారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనంపై ప్రసంగాలు, కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో మాతృభాషపై ప్రేమ, అభిమానం పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు శాఖను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.కార్యక్రమంలో అధ్యాపకులు జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ నహేదా తపస్సుo, తెలుగు శాఖ అధ్యాపకులు, డాక్టర్ యూ రవికుమార్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ సంతోష్, దివ్య, సురేందర్ , రామకృష్ణ, ముత్యం, శ్రావన్య కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.