

పయ నించే సూర్యుడు జూలై 29 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేయనున్న నేపథ్యంలో రాజాం నియోజకవర్గంలో జనసమీకరణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై పలు సూచనలు చేశారు. రాజాం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రేగిడి, సంతకవిటి, వంగర మండలాలు, రాజాం గ్రామీణ మండలం, రాజాం పట్టణం మండల పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ నారాయణరావు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం రాష్ట్రానికి చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అఖండ స్వాగతం పలికేలా భారీ స్థాయిలో ప్రజలను సమీకరించాలని సూచించారు.అదేవిధంగా సమావేశానికి హాజరయ్యే ప్రజలకు రవాణా, తాగునీరు, భోజనం తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుస్తుందని, దీనిని "మన విమానాశ్రయం" అనే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీఎంఆర్ సంస్థ వ్యవస్థాపకుల స్వగ్రామమైన రాజాం ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.