
పంచాయతీ భవనానికి ప్రభుత్వ స్థలం, అంగన్వాడీలకు స్థలాలు, డ్రైనేజీలు–కల్వర్టుల పునరుద్ధరణపై ప్రత్యేక అధికారి దృష్టికి సమస్యలు
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 12, అశ్వాపురం: అశ్వాపురం మండల స్థాయి సమీక్ష సమావేశం స్థానిక ఎంపీడీవో ముత్యాలరావు ఆధ్వర్యంలో, ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు, సిబ్బంది, అలాగే మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.సమావేశంలో మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బాణోత్ సదర్ లాల్ అశ్వాపురం గ్రామానికి సంబంధించిన పలు ప్రధాన సమస్యలను ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా అశ్వాపురం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సర్పంచ్ కోరారు. గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండటం ద్వారా పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా అశ్వాపురం గ్రామంలోని నాలుగు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి, నూతన శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.అశ్వాపురం నుంచి గొందిగూడెం వైపు నిర్మించిన నూతన బీటీ రోడ్డు విస్తరణ సందర్భంగా గ్రామంలోని సైడ్ డ్రైనేజీలు, కాలువలు, కల్వర్టులు దెబ్బతిన్న విషయాన్ని సర్పంచ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గ్రామపంచాయతీపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వివరించారు.దెబ్బతిన్న డ్రైనేజీలు, కాలువల పునరుద్ధరణకు జేసీబీ పనులకు సుమారు రూ లక్షయ్యభైవేలు, కొత్త కల్వర్టుల నిర్మాణానికి సుమారు రూ ఎనిమిది లక్షలు అవసరమవుతాయని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా మండలంలో హ్యాండ్‌బోర్ మరమ్మతులకు ప్రత్యేక మెకానిక్ లేకపోవడం వల్ల గ్రామపంచాయతీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులతో మరమ్మతులు చేయించుకోవాల్సి రావడంతో ఒక్కో హ్యాండ్‌బోర్ రిపేర్‌కు సుమారు రూ.రెండువేల ఐదువందలవరకు ఖర్చు అవుతోందని వివరించారు. మండల స్థాయిలో హ్యాండ్‌బోర్ మెకానిక్‌ను నియమించి, అన్ని గ్రామపంచాయతీలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సర్పంచ్ ప్రస్తావించిన సమస్యలపై స్పందించిన ప్రత్యేక అధికారి హ్యాండ్‌బోర్ మెకానిక్ నియామకానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇతర సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల స్థాయిలో చర్చించి పరిష్కార మార్గాలు చూపేందుకు ఈ సమీక్ష సమావేశం ఉపయోగకరంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, ప్రత్యేక అధికారి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది, మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.