
పయనించే సూర్యుడు, డిసెంబర్ 02( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల కేంద్రంలోని మండేపల్లి గ్రామం ఈరోజు రాజకీయంగా కాసేపు కిక్కిరిసిపోయింది. గ్రామ సర్పంచ్ పదవికి గాధగోని సాగర్ నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. చిన్నతనం నుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తి, ఒక ఉద్యమ కార్యకర్తగా సమాజ సమస్యల కోసం పోరాటం, అలాగే జర్నలిస్టుగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన అనుభవం— సాగర్ గ్రామ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.నామినేషన్ దాఖలు చేసేముందు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. సమానత్వం, న్యాయం, అభివృద్ధి అనే అంబేద్కర్ సిద్ధాంతాలను మార్గదర్శకంగా తీసుకుని గ్రామ అభివృద్ధికై నిరంతరం పనిచేస్తానని సాగర్ ఈ సందర్భంగా ప్రకటించారు.గ్రామంలో తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, వెలుగు సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వయం సహాయక కార్యక్రమాలు — వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టితో పనిచేసే ప్రణాళికను రూపొందించానని తెలిపారు. సర్పంచ్ పదవి నాకు ఒక పదవి కాదు… గ్రామ సేవకు ఒక వేదిక అని చెప్పిన సాగర్, ప్రజల ఆశీర్వాదం, సహకారం ఉంటే మండేపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అనుచరులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలియజేశారు. నామినేషన్ దాఖలు అనంతరం గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని తలపించింది. మండేపల్లి గ్రామం వచ్చే రోజుల్లో రాజకీయంగా మరింత ఉత్సాహభరితంగా మారనుందని కనిపిస్తోంది.