
పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీ ఖానా వేదికగా ‘సఖి సురక్ష’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి అండగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ముందుగా గుర్తించడం జరుగుతుందని రక్తహీనత, విటమిన్ మరియు ప్రోటీన్ లోపాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందన్నారు . రొమ్ము, గర్భాశయ మరియు నోటి క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రత్యేక ఆరోగ్య కార్డులు, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్, ఏడాదికి 4 సార్లు టెలీ కన్సల్టేషన్ సేవలు మరియు అవసరమైనప్పుడు రెఫరల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి ఫరూక్ వివరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పిడి వెంకట దాసు, సీఎంఎం విజయభాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మెప్మా అధికారులు, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
