మహిళా మార్ట్ ప్రత్యేకత చాటే విధంగా ఏర్పాట్లు చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
మహిళా మార్ట్ ప్రత్యేకత చాటి చెప్పే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్, సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయు భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూమహిళా మార్ట్ ముందు పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ, స్లైడింగ్ గేట్ ఏర్పాటుచేయాలని, మహిళా మార్ట్ కు ఆకర్షణీయంగా పెయింటింగ్ వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొదటిసారిగా మహిళల చేత రిటైల్స్ స్పేస్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మహిళా మార్ట్ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత ఖమ్మం నగరంలో మరి కొన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. మహిళా మార్ట్ లో స్వశక్తి మహిళా సంఘాలచే తయారుచేసిన పదార్థాలు, వస్తువులు విక్రయించడం జరుగుతుందని, ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం, అమ్మే మహిళ స్టోరీనీ డాక్యుమెంట్ చేస్తూ ప్రదర్శించాలని అన్నారు.ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా చూడాలని, ప్రైవేట్ షాపింగ్ మాల్స్ లో అనుసరిస్తున్న మోడల్ లను పరిశీలించి మహిళ మార్ట్ ప్రత్యేకతగా ఉండేలా తయారు చేయాలని, ఖమ్మం జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడే వస్తువులకు మంచి మార్కెటింగ్ మన మహిళా మార్ట్ ద్వారా అందించి అధిక ఆదాయం సంపాదించేలా చూడాలని అన్నారు. మార్చి మొదటి వారంలోగా మహిళా మార్ట్ గ్రౌండ్ అయ్యే విధంగా మన కార్యాచరణ ఉండాలని కలెక్టర్ తెలిపారు.మహిళా సంఘాల ద్వారా లాభదాయకంగా నడిచే యూనిట్లపై ప్రచారం కల్పించాలని అన్నారు. మహిళా మార్ట్ లో మహిళా సంఘాల ద్వారా తయారు చేసే పదార్థాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి వస్తువుపై మేడ్ ఇన్ ఖమ్మం స్టిక్కరింగ్ ఉండాలని, పదార్దాల బ్రాండింగ్ పెంచేందుకు ప్రయత్నించాలని అన్నారు. మహిళా మార్ట్ కు అవసరమైన నిధులను డి.ఆర్.డి.ఓ. ద్వారా రెండు రోజులలో అందించడం జరుగుతుందని, పనులు నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కాంపౌండ్ వాల్, బ్రిక్ వర్క్, వైట్ సర్ఫేస్ వచ్చే సోమవారం నాటికల్లా పూర్తి చేసి పెయింటింగ్ చేసే విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.