
స్త్రీ శక్తి పథకంతో మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు
ప య నించే సూర్యుడు ఆగస్టు 16 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)మహిళలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి సుభాష్ రామచంద్రపురం, ఆగస్టు 15: మహిళల సాధికారతకు, వారి ఆర్థిక పురోగతికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న "స్త్రీ శక్తి" పథకం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం రామచంద్రపురంలో మంత్రి సుభాష్ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను పలకరించిన మంత్రి, స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై, పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. రోజువారీ ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్య అవసరాల కోసం బస్సులను వినియోగిస్తున్న మహిళలు తమ అనుభవాలను మంత్రికి వివరించారు.మహిళలు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తమ కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కల్పించిందన్నారు. ప్రతినెలా ప్రయాణ ఖర్చుల రూపంలో అయ్యే వ్యయం గణనీయంగా తగ్గడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. విద్యార్థినులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి మహిళలు, చిన్న వ్యాపారులు ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి, మంత్రి సుభాష్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలపై పడుతున్న ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు, వారి ఆదాయంలో పొదుపు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్యం, స్వయం ఉపాధి అవకాశాల కోసం మరింత సులభంగా ప్రయాణించే అవకాశం ఈ పథకం ద్వారా కలిగిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికంగా బలమైన శక్తిగా, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, రుణ సదుపాయాలు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని, మహిళల స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఈ పథకం ఒక మైలురాయిగా నిలిచిందని మంత్రి సుభాష్ తెలిపారు. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వారి అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్తులో అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.