పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ -నారాయణపేటలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయం, ఎల్ ఎస్ టీవీ స్టూడియో ప్రారంభం సమాజంలో మీడియా పాత్ర చాలా విలువైనదని, మీడియా రంగం ప్రజల పక్షం ఉండాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కార్యాలయాన్ని, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు,సీనియర్ జర్నలిస్టు లొట్టి శ్రీను ఏర్పాటు చేసిన ఎల్ ఎస్ టీవీ ఛానెల్ ను ఆమె ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,గుడిగ రఘు,బండి విజయ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీక అరుణ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రతిబింబింప జేయటంలో ఎల్ ఎస్ టీవీ ముందుండాలని, సామాన్యుల సమస్యలు వెలుగు చూసేలా కృషి చేయాలని సూచించారు. పాలకులు చేసే తప్పిదాలను మీడియా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల పక్షాన నిలవాలని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మీడియా రంగం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ తరం పాత్రికేయులు వార్తల సేకరణ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జర్నలిస్టులు చైతన్యవంతంతో ప్రజల తరపున నిలవాలని అన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉండే నారాయణపేట జిల్లాలో జర్నలిస్టులు మరింత చైతన్యంతో ముందుకు సాగాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి,ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మహ్మద్ రఫీ, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి మాధవ్, కోశాధికారి లింగం తదితరులు పాల్గొన్నారు.