
అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు నవంబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, చౌదరిగూడా పోలీసులు విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్, ప్రకాష్, శ్రీను, అరుణ్, వినోద్ ఉన్నారు. నిరసనకు సిద్ధమవుతున్న నాయకులను ఆకస్మికంగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.విద్యార్థులు శాంతియుతంగా తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నప్పటికీ, పోలీసులు ముందుగానే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.
ఏఐఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. నిరసనలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.
