
పయనించే సూర్యుడు న్యూస్ :భారీ నిర్మాణ సంస్థలకు హీరోల డేట్లు దక్కించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కోట్లకు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటారు. హీరోలు డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే సినిమాని తీస్తుంటారు. ఇప్పుడే చేయాలి.. అప్పుడే చేయాలనే నియమం ఏమీ పెట్టుకోరు. కాకపోతే హీరోకి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ఓ మాట తీసుకుంటారంతే. అలా హీరోకి కథ నచ్చినప్పుడు, డేట్లు వీలైనప్పుడు సినిమాని పట్టాలెక్కిస్తుంటారు. అలా ఇప్పుడు సౌత్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ చేస్తున్నది కూడా ఇదే. ఇప్పటికే తమిళంలో టాప్ హీరోలందరినీ లాక్ చేసిందీ బడా సంస్థ. తెలుగులోనూ కేవీఎన్ ప్రొడక్షన్స్ దూసుకుపోతోంది. ఆల్రెడీ చిరంజీవికి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంది. దర్శకుడు బాబీ, చిరంజీవిని మళ్లీ కలిపి ఓ సినిమాను ఈ సంస్థ ప్రొడ్యూస్ చేసేందుకు సిద్దమైంది. ఇక పవన్ కళ్యాణ్‌కి సైతం భారీ రేంజ్లో అడ్వాన్స్ ఆఫర్ చేశారని సమాచారం. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ డేట్లు ఎప్పుడు లభిస్తాయో చెప్పడం కష్టం. మరి ఈ కేవీఎన్కు పవన్ కళ్యాణ్ డేట్లు ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్‌కి సైతం కేవీఎన్ ప్రొడక్షన్స్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసిందని సమాచారం.అలా తెలుగులో టాప్ స్టార్లని కేవీఎన్ తన చేతుల్లోనే పెట్టుకుందని తెలుస్తోంది. చిరు, పవన్, ఎన్టీఆర్ ఇలా అందరినీ తమ కాంపౌండ్లోనే ఉంచేసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ మాత్రం కేవీఎన్‌కి ఓ సినిమా చేయాల్సి ఉందట. మరి లోకేష్ కథకు పవన్ కళ్యాణ్‌ని తీసుకుంటారా? ఎన్టీఆర్‌ను సెట్ చేస్తారా? అని జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే తన డేట్లను ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ప్రశాంత్ నీల్ మూవీ తరువాత వెంటనే నెల్సన్ లేదా త్రివిక్రమ్ లేదా కొరటాల శివ సినిమాల్ని చేయాల్సి ఉంటుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం ఇలా పెద్ద హీరోలందరికీ అడ్వాన్స్‌లు ఇచ్చి.. ఎవరితో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో చెప్పకుండా మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. మరి లోకేష్ కనకరాజ్ అయితే రీసెంట్‌గానే బన్నీకి ఓ కథ వినిపించారని అంటున్నారు. వీటిలో చివరకు ఏది నిజం అవుతుంది? ఏది తెరపైకి వస్తుంది? అన్నది చూడాలి. కేవీఎన్ ఇప్పుడు కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సంక్రాంతి బరిలో దించుతున్నారు.