
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇంతకు ముందు ఇళ్లు కూలిన బాధితులు జగన్‌కు కలిసి తమ సమస్యలను వివరించినట్లు వైసీపీ తెలిపింది. జగన్ విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజల డబ్బులతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలపై తీసుకుంటున్న నిర్ణయాలను ఆపాలని కోటి మంది ప్రజలు సంతకాలు చేశారని జగన్ వెల్లడించారు. గతంలో మా ప్రభుత్వ హాయంలో పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలు కట్టించామన్నారు. కానీ ఇప్పడు చంద్రబాబు ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ విజయవంతం అయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కోటి సంతకాల సేకరణ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో జగన్ పోస్టు చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోతుందని వైఎస్ జగన్ వెల్లడించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన కోటి సంతకాల పత్రాలను డిసెంబర్ 18న రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు మాజీ సీఎం జగన్ వెల్లడించారు.