పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఫిబ్రవరి 09మామిడిపెల్లి లక్ష్మణ్:- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, మైతాపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఓటర్ల తరఫున తలారి రాజేష్ ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం మైతాపూర్ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,884 ఉందని, కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు పోలింగ్ కేంద్రాలలోనే ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి వస్తుందని, ఇది ఓటర్లకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని,ఎన్నికల సమయంలో ఎండలు తీవ్రమై, ఓటర్లు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని,ప్రస్తుత మూడు పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుదీర్ఘ సమయం పడుతుందని,తగిన పారిశుధ్య, నీటి వసతులు లేని కారణంగా పెద్దవారికి, మహిళలకు, దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు 600 ఓట్లు మాత్రమే ఉండేలా,మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా వినతి పత్రంలో కోరారు. ఇది ప్రజలకు గొప్ప సౌలభ్యం కలిగించడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దోహదపడుతుందని,ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి,తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో విన్నవించారు.