మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
మొగిలిగిద్ద మండలం చేయడానికి ఆనాడు ఉద్యమం చేసింది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మొగిలిగిద్ద మండలాన్ని చేయకపోతే ప్రజలు క్షమించరు
చించోడు, మొగిలిగిద్ద మండలాలను ప్రకటించాల్సిందే
మండలాలు ప్రకటిస్తే రెండింటికి.. రెండు కోట్ల చెక్కులు వేదికపైనే ముఖ్యమంత్రికి ఇస్తా
ఎమ్మెల్యే శంకర్ మొగలిగిద్ద ఆందోళన వీడియోలను విడుదల చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మండలం ప్రకటించకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి
మొగలిగిద్ద గ్రామస్తుల హెచ్చరిక
(పయనించే సూర్యుడు జనవరి 29 రిపోర్టర్ రవీందర్ )
షాద్ నగర్ నియోజకవర్గంలో మొగలిగిద్ద, చించోడు గ్రామాలను రెండు మండలాలుగా ప్రకటించకపోతే చరిత్ర క్షమించదని ప్రజలు ఊరుకోరని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుదవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మొగిలిగిద్ద గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గతంలో మొగిలిగిద్ద మండల డిమాండుతో ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉద్యమం చేశారని, ఆనాడు ఎమ్మెల్యే శంకర్ ఉద్యమ సమయంలో మాట్లాడిన మీడియా వీడియోలను విడుదల చేశారు. మండలం చేయమంటే గత ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు నాన్చుతున్నారని మండలాలు ఏమైనా వారి అబ్బ సొత్తతా అని తీవ్ర పదజాలాలు ఆనాడు వారిపై ఎమ్మెల్యే శంకర్ ఉపయోగించారని మరి ఈనాడు మండలం చేయకపోతే ప్రజలు క్షమిస్తారా? అని ప్రశ్నించారు. గత పది ఏళ్లలో మండలాలు చేయకపోవడం తమ పొరపాటుగా చెప్పినప్పుడు మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే శంకర్ మండలాల కేటాయింపు కోసం కృషి చేయాల్సిందేనని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మొగిలిగిద్ద గ్రామానికి వస్తున్న శుభ తరుణం ఇదని ఇలాంటి కీలక సమయాల్లో మండలం ఇవ్వాలని అది కూడా చించోడు, మొగిలిగిద్ద రెండింటిని మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 150 ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం కోసం రావడం తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ప్రజల పక్షాన వారి గొంతుకనై ఈ విషయాన్ని మీడియా సమావేశం ద్వారా తెలుపుతున్నానని నవీన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఉద్యమ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వీర్లపల్లి శంకర్ మాటలకు ఎంతోమంది స్థానికులు తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారని మండలాలు ఇవ్వాల్సిందేనని ఆందోళనలు ఉధృతం చేశారని ఇప్పుడు మాట తప్పితే, పరిస్థితి వేరేలా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ద్వారా తమ డిమాండ్ ను స్వీకరించి ఇక్కడికి వచ్చిన సమయంలో మండలాలు ప్రకటించాలని ఒకవేళ రెండు మండలాలు ప్రకటిస్తే చెరో మండలానికి ఒక కోటి రూపాయల చొప్పున రెండు కోట్లు చెక్కుల ద్వారా ఇస్తానని స్పష్టం చేశారు.
మొగిలిగిద్ద గ్రామానికి వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారని ఈ వరాల జల్లులో మండలాలు కచ్చితంగా ఉంటాయని తాను ప్రధానంగా విశ్వసిస్తున్నానని అన్నారు.
కళాశాల నిర్మాణం పేరుతో వీర్లపల్లి శంకర్ సొంత బిల్డప్
ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం పేరుతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బిల్డప్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కళాశాల నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చయితాయి ? ఎంతమంది చందాలు ఇస్తున్నారు? లక్షల్లో చందాలు ఇస్తున్న వారు ఏమి ఆశించి ఇస్తున్నారు అని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మీడియా సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవా అంత దినావస్థ స్థితిలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కట్టడానికి ప్రభుత్వ అనుమతి ఉందా ? అంటూ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కళాశాల భవన నిర్మాణానికి చందాలు ఇస్తున్న పారిశ్రామికవేత్తలు వ్యాపార వర్గాలు ఏమి ఆశించి ఇస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. స్వస్తిక్, సౌత్ గ్లాస్ లాంటి వివాద పరిశ్రమల యాజమాన్యం లక్షలాది రూపాయల విరాళాలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. సౌత్ గ్లాస్ పరిశ్రమలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎంత సాయం చేశారు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శంకర్ ఎంత సాయం చేయించారు ఏ లాభం లేకపోతే ఎమ్మెల్యే కడుతున్న భవనానికి పారిశ్రామికవేత్తలు లక్షలాది రూపాయల చెక్కులు విరాళంగా ఇస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. కళాశాల నిర్మాణం పై తాను వ్యతిరేకం కాదని, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే ఇంత దిగజారిన స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. తనలాంటి వాళ్లు కూడా చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాకపోతే అది డబ్బుల రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇవ్వడానికి సిద్ధమని అన్నారు. విరాళాల పేరిట ఇదోక వ్యాపారంగ మారిందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొగిలిగిద్ద గ్రామస్తుల హెచ్చరిక
మొగలిగిద్ద గ్రామానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నామని అయితే తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ ఎదుర్కోవాల్సి ఉంటుందని మొగలిగిద్ద గ్రామ నాయకులు రాధాకృష్ణ, గుట్ట రాజులు హెచ్చరించారు. ఎమ్మెల్సీ మీడియా సమావేశం సందర్భంగా గ్రామస్తులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నో రోజులుగా తాము మండలం కోసం ఎదురుచూస్తున్నామని ఆనాడు ఎమ్మెల్యే శంకర్ వెంటనే తాము ఉన్నామని ఉద్యమంలో పాల్గొన్నామని అప్పట్లో అంజయ్య యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో వారి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేశామని గుర్తు చేశారు. మొగలిగిద్దను మండలంగా ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించడం గమనార్హం..