ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని రద్దు చేయాలి.
ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
ఈ నెల 17,18 తేదీలలో కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే వంటావార్పు ను జయప్రదం చేయండి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బీసా సాయిబాబు
( పయనించే సూర్యుడు మార్చ్ 14 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)
షాద్ నగర్: మొబైల్ అంగన్వాడి సెంటర్స్ ని రద్దు చేయాలని, దేశంలో ఐసిడిఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు దాటిందని, ఐసిడిఎస్ చేస్తున్న సేవలను మరువలేమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బీసా సాయిబాబు అన్నారు. గురువారం నాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సిడిపిఓ షబానా బేగం కు అంగన్వాడి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఐ సి డి ఎస్ ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని కోరారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో పీఎం శ్రీ పథకం కింద ప్రైమరీ కేంద్రాలను 28 జిల్లాలో 56 కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం చేసిందని, ఈ నిర్ణయం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే చర్య తప్ప మరొకటి కాదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మొబైల్ అంగన్వాడీ సేవల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని, దీనివల్ల అంగన్వాడి కేంద్రం లో టీచర్ హెల్పర్ అందించే సేవలు ప్రజలకు దూరమవుతాయని వివరించారు. పేద ప్రజలతో పాటు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు నష్టం కలిగించే ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం వేతనాన్ని 18 వేలకు పెంచాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీ అయిన 4000 మంది అంగన్వాడీ టీచర్లకు పది నెలల వేతన బకాయి వెంటనే చెల్లించాలని అన్నారు. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా జీవో జారీ చేయాలని తెలిపారు. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ అమలు చేయాలని వివరించారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాల లో సమానంగా ఒకపూట బడి మే నెల అంతా ఇద్దరికీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ యాప్ లన్నింటినీ రద్దుచేసి ఒకె యాప్ ఉండే విధంగా చూడాలని కోరారు. కాలి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అన్నారు. అదేవిధంగా ఈనెల 17,18 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే వంటవార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీను నాయక్, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ, హేమలత, ఇందిరా, అరుంధ, అనిలా, సరోజా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.