హైదరాబాద్, జనవరి 6: చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా వర్చువల్‌గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొని ప్రసంగించారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు. ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందని.. రీజనల్ రైల్ అవసరం కూడా ఉందన్నారు. రైల్ రింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.