పయనించే సూర్యుడు, ఆగస్టు 22, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఐటీఐ కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్( ఏటిపి) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆధునిక పరికరాలు శిక్షణా ల్యాబొరేటరీలు వర్క్‌షాప్ విభాగాలు మరియు తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు . విద్యార్థులు పొందుతున్న శిక్షణ సదుపాయాలపై స్పందనలు అడిగి తెలుసుకుని, మరింత కృషి చేసి మంచి అవకాశాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు నేర్చుకుంటున్న పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ పద్ధతులు భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నలు అడిగి వారిని ప్రోత్సహించారు.కలెక్టర్ మాట్లాడుతూ ఏటీసీ వంటి ఆధునిక శిక్షణా కేంద్రాలు యువతలో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విస్తరించడానికి ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, స్మార్ట్ బోర్డులు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయికి ఎదగాలి అని పిలుపునిచ్చారు.ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏటిసి వంటి శిక్షణా కేంద్రాలు ఈ దిశగా మైలురాయిగా నిలుస్తాయని ఆయన అన్నారు.ఈ కేంద్రంలో మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్డ్ సిఎన్సి (సి ఎన్ సి) మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఒక్కో కోర్సుకు 20 నుండి 40 సీట్ల వరకు, ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు వ్యవధి కల్పించబడిందని తెలిపారు. కనీస అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత అయివుండాలని తెలిపారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.