పయనించే సూర్యుడు న్యూస్ మిర్యాలగూడ సెప్టెంబర్ 16. యూరియా డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఓ ఎమ్మెల్యే గన్‌మెన్ నేరుగా మార్క్‌ఫెడ్ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి సార్ చెప్పిండంటూ.. ఓ లారీ యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగూనాయక్ 15 రోజుల క్రితం మార్క్‌ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి ఎమ్మెల్యే సార్ బిజీగా ఉన్నారని ఓ లారీ లోడు యూరియాను మాడ్గులపల్లి మండలం కుక్కడం ఎన్డీసీఎస్కు పంపించాలని సూచించారు. అది నమ్మిన మార్క్‌ఫెడ్ డీఎం ఆ విషయాన్ని మెసేజ్ ద్వారా జిల్లా వ్యవసాయాధికారికి సమాచారం ఇచ్చారు. వ్యవసాయాధికారి అది నిజమని నమ్మి ఓ లారీ లోడును ఇండెంట్ ఇచ్చారు. దీంతో లోడుతో ఉన్న ఆ యూరియా లారీ కుక్కడం సొసైటీకి వెళ్లింది. ఇటీవల జిల్లా వ్యవసాయాధికారికి అనుమానం వచ్చి మార్క్‌ఫెడ్ డీఎంను ప్రశ్నించగా ఆమె మళ్లీ విచారణ చేపట్టారు. విచారణలో ఎమ్మెల్యే చెప్పలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. అసలు యూరియాను సొసైటీకి పంపమని ఎమ్మెల్యే చెప్పనేలేదని తేలింది. దీంతో యూరియా పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన గన్‌మెన్‌ను నల్లగొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేసి, విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. యూరియా పక్కదారి పట్టలేదు యూరియాను పక్కదారి పట్టించిన విషయమై జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ను వివరణ కోరగా యూరియా పక్కదారి పట్టలేదన్నారు. కుక్కడం ఎన్డీసీఎస్కు కేటాయించామని, ఆ యూరియాను రైతులే తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే గన్‌మెన్ తాను ఎమ్మెల్యే పీఏనంటూ అబధ్ధం చెప్పి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లకుండా యూరియాను అలాట్ చేయాలని కోరారని వ్యవసాయాధికారి పేర్కొన్నారు.