
పయనించే సూర్యుడు న్యూస్ :సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇప్పటికి వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్ ఒకప్పటి హిట్ డైరెక్టర్ తో మరో కొత్త సినిమాని ప్రకటించారు. శ్రీకాంత్ ప్రేయసి రావేతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు చంద్ర మహేష్. అనంతరం అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం.. లాంటి పలు సినిమాలతో మంచి విజయాలు సాధించారు.ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న దర్శకుడు చంద్ర మహేష్ ఇప్పుడు మహేష్ చంద్రగా మారి ‘పిఠాపురంలో’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘అలా మొదలైంది’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరక్కిస్తున్నారు. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు మహేష్‌చంద్ర మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు ఉంటాయి. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ ఈ సినిమాలో చూపిస్తున్నాం. పిఠాపురం ఈ మధ్య బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పిఠాపురం నేపథ్యంలోనే ఈ సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 6 రోజులు షూటింగ్ చేసాము. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.