
పయనించే సూర్యుడు న్యూస్ :76వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. సంవిధాన్ సదన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ పాల్గొని, రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్మరించుకుంటూ, పౌరులందరూ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను, హక్కులు, విధులను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి నొక్కి చెప్పారు. భారత ప్రజాస్వామ్య మూలస్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని, దాని మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని యువతపై ఉందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు రాజ్యాంగం ఎంత కీలకమో ఆయన వివరించారు.
రాజ్యాంగం బహుళ భాషల్లోకి అనువాదం: ఈ వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం భారత రాజ్యాంగాన్ని బహుళ భాషల్లోకి అనువదించిన ప్రతులను విడుదల చేయడం. భారత రాజ్యాంగం ప్రజలందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో దీనిని విడుదల చేశారు. తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి అనువదించారు. రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం ద్వారా దేశంలోని పౌరులు తమ మాతృభాషలో చట్టం, పాలన యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుందని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.