
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు చూస్తే మన రహదారులు కాస్తా మృత్యు ద్వారాలుగా కనిపిస్తున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ పోయినా, బైక్, ఆటో, ప్రైవేట్ లేదా ప్రభుత్వ బస్సు, రైలు, విమానల్లో ప్రయాణం చేసిన మన ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. మొన్న కర్నూల్లో దాదాపు 19 మంది సజీవ సమాధి కాగా, నిన్న చేవెళ్ల వద్ద దాదాపు 20 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.ఇవాళ(మంగళవారం) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డైవర్తో పాటు బస్సులో ఉన్న 15 మందికి ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాద సమయంలో బస్సు 50 స్పీడ్తో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వేగం తక్కువగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత తక్కువ ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. బస్సులో అందరూ నిద్రపోతూ ఉండటం వల్ల.. బస్సు అద్దాలు గుచ్చుకున్నాయని పోలీసులు వెల్లడించారు..