

గాంధీ భవన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయగలిగాం: పీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందని, గాంధీ భవన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు కార్యకర్తలకు భరోసా, పార్టీకి బలాన్ని అందించగలిగామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ , రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తో కలిసి గాంధీ భవన్ లో సన్మానించారు.ఈ సందర్భంగా అసెంబ్లీలో సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేశామని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలిగామని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంలో విజయవంతమయ్యామని పేర్కొన్నారు. గత రెండేళ్లు సజావుగా సాగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సమన్వయం ఎంతో దోహదపడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి తనకు సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు.గాంధీ భవన్‌ను కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రులను గాంధీ భవన్‌కు ఆహ్వానించి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గాంధీ భవన్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించడం పీసీసీ అధ్యక్షుడిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు గాంధీ భవన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసిన బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు