సమావేశంలో మాట్లాడుతున్న డిఈఓ అశోక్ కుమార్..
రుద్రూర్, ఏప్రిల్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ రుద్రూర్ ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరానికి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిభిరం జిల్లాలోనే ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. రుద్రూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మండలంలోని అన్ని గ్రామాల పేద విద్యార్థుల ఉన్నతికి పాటుపడడం ఎంతో అభినందనీయ మన్నారు. ఇది అన్ని గ్రామాలకు ఆదర్శమని తెలియజేశారు. విద్యార్థులు తమకు ఎంతో ఉపయోగపడే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కోరారు. రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఇంతటి మహాత్వపూర్వకమైన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రావడం, విద్యార్థుల కొరకు ఆయన విలువైన ప్రసంగం ద్వారా వారికి ప్రేరణ కలిగించినందుకు రైడ్స్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో నిష్ణాతులైన అధ్యాపకులు విద్యార్థులకు విలువైన విద్యను అందిస్తారని విద్యార్థులు ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకొని తమ తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కట్టా శ్రీనివాస్ రావు, ప్రధానోపాధ్యాయులు దుర్కి సాయన్న, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, అసోసియేట్ అధ్యక్షులు మహాజన్ నర్సిములు, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజు, కోశాధికారి చిదుర మహిపాల్ గుప్తా, గౌరవ సలహాదారులు పత్తి రాము, కెవి మోహన్, బెజుగం వెంకటేశం గుప్తా, మరియు కార్యవర్గ సభ్యులు, 60 మంది విద్యార్థులు, పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.