పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 29:- రిపోర్టర్( కే శివకృష్ణ ) ఈరోజు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ నాయకత్వంలో పచ్చిమిర్చి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని వైయస్సార్సీపి రేపల్లె ఆధ్వర్యంలో తుమ్మలపాలెం, పరిసర ప్రాంతాల్లో పర్యటించి పచ్చిమిర్చి పండించేటువంటి రైతులను, కౌలు రైతులను, కూలీలను కలిసి వారు పడుతున్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి మద్దతుగా, అండగా ఉంటాం అన్న భరోసా కల్పించిన అనంతరం, చెరుకుపల్లి MROకి భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగ నాగార్జున ముఖ్య అధ్యక్షులుగా పాల్గొనడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, జిల్లా, నియోజకవర్గ,మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ పార్టీ నాయకులు, రైతులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ సందర్భంలో ఎమ్మార్వో గారికి ఈ కింది విధంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.బాపట్ల జిల్లాలోని, చెరుకుపల్లి మండలంలో తుమ్మలపాలెం పంచాయతీ పరిసర ప్రాంతాలలో సుమారు వెయ్యి ఎకరాలు పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు.ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండించే వాణిజ్య పంట పచ్చిమిర్చి కావడం విశేషం.గత ప్రభుత్వ పాలనలో పచ్చిమిర్చికి మంచి గిట్టుబాటు ధర ఉండేది.గత సంవత్సరం 2023-24లో సుమారు 50 కిలోల మిర్చి బస్తాకురూ.1500/- నుండి రూ.3000/- ల రూపాయల వరకు ధర ఉండేది.పచ్చిమిర్చి సాగు చాలా ఖర్చుతో కూడిన పని, ఒక ఎకరా సాగు చేయడానికి రైతుకు రూ.1,30,000/- నుండి రూ.1,50,000/- వరకు ఖర్చు అవుతుంది.దిగుబడి బాగా ఉన్నప్పటికీ మంచి గిట్టుబాటు ధర ఉంటేనే పచ్చిమిర్చి రైతులకు ఆశించిన ఫలితం ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కనీస గిట్టుబాటు ధర లేకపోవడం వలన 50 కిలోల బస్తా కి రూ.300/- నుండి రూ. 500/- ధర మాత్రమే పలుకుతుంది కూలీ గోతాల ఖర్చులకు కూడా వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు చార్జీలు, ఎరువుల ధరలు, కూలి రేట్లు కూడా అధికంగా ఉండడం వల్ల పెట్టుబడి ఎక్కువ అవ్వడం వలన రైతులకు తలకు మించిన భారమై తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.గిట్టుబాటు ధర లేకపోవడం వలన చాలామంది రైతులు కొన్ని వందల ఎకరాల్లో తాము కష్టపడి పండించిన పంటను కోయకుండా వదిలేస్తున్నారు.చాలామంది రైతులు నిండా మునిగిపోయి అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారు.కావున తమరు దయచేసి ప్రభుత్వ పెద్దలు పచ్చిమిర్చి రైతులను ఆదుకోవాలని, పచ్చిమిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వం దీని మీద సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.