పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు: సోమవారం ఏ.డి.ఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిహరిప్రియ నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, కామేపల్లి కృష్ణ ప్రసాద్, దేవి లాల్ లు పాల్గొని మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నా రైతులకు కనీసం యూరియా కూడా సకాలంలో సరఫరా చేయలేని దుస్థితిలో ఉందన్నారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు నిజమైన ధరకు ఎరువులు అందజేసేలా చూడాలన్నారు. యూరియా కొరత కారణంగా ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం అందించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పార్టీ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు