పయనించే సూర్యుడు. ఏప్రిల్ 17. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టమని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు.గురువారం ఇంచార్జ్ కలెక్టర్, నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూ భారతి చట్టం ద్వారా దొరుకుతుందని అన్నారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీ-సేవలో లాగే దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని, భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు.
భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను ఇంచార్జ్ కలెక్టర్ వివరిస్తూ భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్, సాదా బైనామా కు సంబంధించిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడాప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడు తుందన్నారు. పాత పోర్టల్ ధరణి నుండి క్రొత్త పోర్టల్ భూ భారతికి షిఫ్ట్ అవుతున్నందున లోటుపాట్లు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి పైలట్ స్టడీకి రాష్ట్రంలో 4 మండలాలు ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారని, ఇది రాష్ట్రం తరఫున పెద్ద బాధ్యతని, అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో చట్టంపై అవగాహన కార్యక్రమాలకు కార్యాచరణ చేశామన్నారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, భూ వివాదాల పరిష్కారానికి భూ భారతి చట్టం ఉపయోగపడు తుందన్నారు. ధరణి చట్టంతో అనేక సమస్యలు పరిష్కారం కాక లక్షల మంది ఇబ్బందులు పడ్డారని, భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. 18 రాష్ట్రాల భూ చట్టాలు పరిశీలించి, ఎంతోమంది మేధావులు, రైతులు, అధికారుల సూచనలతో భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన గ్రామ పరిపాలన రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసే విధంగా, గ్రామ పాలనా అధికారులను నియమించనున్నదని, దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై రైతులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. గతంలో ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని, ఇప్పుడు రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. భూమి హక్కుల రికార్డు నిర్వహణతో ఎవరు భూమికి యజమానో స్పష్టతవస్తుందన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.భూమి హక్కుల రికార్డులు భూ భారతి పోర్టల్ లో అందరికి అందుబాటులో వుంటాయన్నారు. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూ భారతిలో ఉన్న ఫారంలో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలని, తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీచేస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన సందేహాలు, సమస్యలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, తహసీల్దార్ తఫజ్జుల్ హుస్సేన్, ఎంపిడివో ఎర్రయ్య, మండల వ్యవసాయ అధికారిణి రాధ, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.