పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్పర్సన్ కోడూరి భాస్కర్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతుల కష్టానికి సరైన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా, తమ పంటకు న్యాయమైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ధాన్యం తేమ శాతం, నాణ్యత వంటి అంశాల్లో అధికారులు రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.ప్రతి రైతు సమయానికి ధాన్యం అమ్మి సకాలంలో చెల్లింపులు పొందేలా చర్యలు తీసుకుంటామని భాస్కర్ గౌడ్ హామీ ఇచ్చారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు పారదర్శకంగా, రైతులకు అనుకూలంగా నడవాలన్నది తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సమాఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రైతు సంక్షేమానికి మద్దతు ప్రకటించారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు సింగిల్ విండో సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం అధికారుల సహకారంతో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహిస్తూ, రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వహణకు పాలక వర్గానికి రైతులు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తాండ్ర రవీందర్ రావు, అబ్బాడి అనిల్ రెడ్డి, గణేష్ గౌడ్, మంద నారాయణ, పొన్నాల కిషన్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీఈవోఅజయ్, లింగారెడ్డి, రవి,శ్రీనివాస్ గౌడ్, శోభ, పాల్గొన్నారు.