
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడి
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.నాలుగు వేల చొప్పున రెండు సీజన్లకు రూ.ఎనిమిది వేలు మొదట చెల్లించింది. ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచింది. అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్పు చేస్తూ, ఎకరాకు పెట్టుబడి సాయం రూ.ఆరు వేలకు పెంచింది. ఈ పథకం ద్వారా అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది. సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు